శ్రీ గురుభ్యో నమ:
ఓం మహా గణాధిపతయే నమ:
మనలో చాలామందికి పిల్లలకి మంచి చదువు రావట్లేదని, ఉద్యోగం రాలేదని, ఇంట్లో శాంతి లోపించిందని, పిల్లలికి వివాహం అవటం లేదని, వ్యాపారం లో నష్టాలు వస్తునాయని ఇంకా అనేక ఇతర సమస్యల తో నిత్యం బాధపడుతూనే ఉంటాం ఈ భాదలకు మూల కారణం మనo పూర్వ జన్మలో చేసుకొన్న కర్మల ఫలితమే.ఇలాంటి సమస్యలు తొలగి పోవాలంటే నవగ్రహరధానను ఒక క్రమపద్ధతిలో చేసుకోవాలి. మానవులు చేసుకొన్న కర్మలను బట్టి ఈ నవగ్రహాలు ఫలితాలను (ఉత్తమ, మధ్యమ, ఆధమ) ఇస్తూ ఉంటాయి మనం నిత్యం దేవతారాధన, నవగ్రహ ఆరాధన చేస్తూ ఉంటె ఈ ఫలితాలు మనకు సానుకూలంగా ఉంటాయి.
ఈ నవగ్రహాలు జాతక చక్రములో కాని, గోచరములో గాని వాటి స్థానాలను బట్టి ఫలితాలు అనేవి ఆధార పడి ఉంటాయి రాశి చక్రములో ఉన్నత స్థితి లో ఉంటె ఉన్నత ఫలితాలు, అధమ స్థితిలో ఉంటె నీచ ఫలితాలు వస్తాయి. నిత్యం నవగ్రహ ఆరాధన చేసి దాన ధర్మాదులు చేస్తారో అట్టి వారికీ సానుకూల ఫలితాలు వస్తాయి.
రవి(సూర్యుడు) గ్రహ అనుగ్రహమునకు
ధ్యాన శ్లోకం: జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వ పాపఘ్నo ప్రణతోస్మి దివాకరమ్
రోజుకి 108 సార్లు, 55 రోజుల పాటు చదవాలి.
దానములు
: ఆదివారం నాడు బ్రాహ్మణుడు కి గోధుమలు, బెల్లం, రాగి పాత్ర ఎర్రటి వస్త్రం లో పెట్టి దానం ఇవ్వాలి . రాగి కడియాన్ని కుడి చేతికి ధరించాలి . గోధుమ వర్ణం లో వున్న ఆవుకి నాన్నపెట్టిన గోధుమలు ఆదివారంనాడు పెట్టాలి. ఆదిత్య హ్రుదయం పారాయణ చేయాలి చదవటం రాని వారు, విన్న (శ్రవణ) కూడాఅద్భుత ఫలితం ఉంటుంది.
చంద్ర గ్రహ అనుగ్రహమునకు
ధ్యాన శ్లోకం: దధిశoఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం.
రోజుకి 108 సార్లు, 93 రోజుల పాటు చదవాలి.
దానములు: సోమవారంనాడు బ్రాహ్మణుడు కి బియ్యం తెల్లని వస్త్రం లో పెట్టి దానం ఇవ్వాలి . ఆవుకి నాన్నపెట్టిన బియ్యంని పెట్టాలి. పౌర్ణమి రోజున పెరుగు అన్నము పది మందికి ఇవ్వగలరు . శ్రీ లక్ష్మిఅష్టకం ను రోజు 1 సారి చదవాలి, తెల్లని వస్త్రాలు పేదవారికి దానం చేసిన మoచి ఫలితాలు వస్తాయి.
కుజ గ్రహ అనుగ్రహమునకు
రోజుకి 108 సార్లు, 65 రోజుల పాటు చదవాలి.
ధ్యాన శ్లోకం: ధరణిగర్భ సంభూతం విద్యుత్కాoచన సన్నిభం
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్
దానములు: మంగళవారంనాడు ఒకటింపావు కిలో కందులు దానం ఇవ్వాలి . ఏడు మంగళ వారాలు ఆవుకి నానపెట్టిన కందులు ఆహారంగా పెట్టాలి. ఆంజనేయ స్వామి ఆలయం ని దర్శించి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.ఎర్రని మందార పువ్వులతో మాలకట్టి హనుమంతునికి ఇవ్వాలి. ఎర్రని చేతి రుమాలు దగ్గర ఉంచుకోవాలి. ప్రతి మంగళవారం అరటి పండు సింధూరంఆంజనేయస్వామికి సమర్పించాలి స్వామి వారి పాదాల వద్ద ఉంచిన తిలకాన్ని నుదుటన పెట్టుకోవాలి
బుధ గ్రహ అనుగ్రహమునకు
ధ్యాన శ్లోకం: ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యo సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్
రోజుకి 108 సార్లు, 158 రోజుల పాటు చదవాలి.
దానములు: బుధవారం నాడు ఒకటింపావు కిలో పచ్చపెసలు దానం ఇవ్వాలి. నానపెట్టి ఆవుకి పెట్టాలి. పెసరపప్పు కలిపి చేసిన కిచిడిని పేదవారికి పదహారు బుధవారాలు దానం చేయాలి. దుర్గ/సరస్వతి దేవతలను నిత్యం పూజించాలి. ఆవుకి ఆకుకూరలు తినిపించాలి. ప్రతి బుధవారం ఆకు కూరలను పేద వారికీ ఉదయం పూట దానం ఇవ్వాలి. ప్రతి రోజు సరస్వతి అష్తోత్రం ను (1 సారి), బుధ శ్లోకమును (17 సార్లు) చదవాలి
గురు గ్రహ అనుగ్రహమునకు
ధ్యాన శ్లోకం: దేవానాo చ ఋషీణాo చ గురుం కాంచన సన్నిభం
బుద్దిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిo
రోజుకి 108 సార్లు, 149 రోజుల పాటు చదవాలి.
దానములు: గురువారం నాడు ఒకటింపావు కిలో శనగలు దానం ఇవ్వాలి. నానపెట్టి ఆవుకి పెట్టాలి. శనగపిండితో చేసిన లడ్డూలను ప్రతి గురువారం సాయిబాబా గుడిలో పంచాలి. పసుపు రంగు రుమాలును కూడా ఉంచుకోవాలి. రావిచెట్టుకునీళ్ళు పోయాలి. శ్రీ సాయిబాబాకి ప్రతి గురువారం అబిషేకం చేయించి శ్రీ సాయిబాబా చాలీసా ను పారాయణం చేసిన ఉత్తమ పలితాలు కలుగుతాయన టం లో సందేహము లేదు.శివాభిషేకం మంచి ఫలితాలను ఇస్తుంది.
శుక్ర గ్రహ అనుగ్రహమునకు
ధ్యాన శ్లోకం: హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్
రోజుకి 108 సార్లు, 185 రోజుల పాటు చదవాలి.
దానములు: శుక్రవారం నాడు ఒకటింపావు కిలో అలసందలు దానం ఇవ్వాలి, నానపెట్టి ఆవుకి పెట్టాలి, ప్రతి శుక్రవారంనాడు 108 ఎర్రతామర పువ్వులను దుర్గదేవి కి మాల గ సమర్పించాలి దుర్గ అష్టోత్తరము చదవాలి, నల్ల చీమలకు పంచదార ఆహారముగ పెడితే మంచి సానుకూల ఫలితాలు వస్తాయి.
శని గ్రహ అనుగ్రహమునకు
ధ్యాన శ్లోకం: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం
రోజుకి 108 సార్లు, 176 రోజుల పాటు చదవాలి.
దానములు: శనివారం నాడు ఒకటింపావు కిలో నల్లనువ్వులు దానంఇవ్వాలి. కాలభైరవ అష్టకం చదవాలి, శనీస్వరునకు నడవటం అంటే ఇష్టం కావునప్రతి రోజు మార్నింగ్ వాక్ తో ప్రరంభిచాలి, నల్లని గొడుగు, నల్లని చెప్పులు, నల్లని బట్టలుపేదవారికి ఒకొక్క శనివారం దానం చేయాలి. ఏలినాటి శని ప్రభావం తగ్గటానికి రోజు కాకులకు అన్నం పెట్టాలి, రావులపాలెం (పూర్వపు తూర్పు గోదావరి జిల్లా) దగ్గరలోని మందపల్లి లో ఉన్న శనిస్వరునకి తైలాభిషేకం చేయాలి, ఎప్పుడు అబద్దాలు అడకుడదు, భార్య పిల్లాతో ఎక్కువ సమయం కేటాయిoచాలి. ఎక్కువగా సాయంకాలంలోశివాలయ దర్శనం, శివ అభిషేకo చేయాలి. శనిత్రయోదశి రోజున శనిస్వరునకి తైలాభిషేకం చెయిoచు కొనవలెను.
రాహు గ్రహ అనుగ్రహమునకు
ధ్యాన శ్లోకం: అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్
రోజుకి 108 సార్లు, 167 రోజుల పాటు చదవాలి.
దానములు: ఆదివారము నాడు ఒకటింపావు కిలో మినుములు దానం ఇవ్వాలి, నానపెట్టి ఆవుకి పెట్టాలి, మంగళవారం లేద ఆదివారం నాడు రావి చెట్టు సమీపంలోని జంట సర్పాల మీద ఆవుపాలు పోయాలి, ఆదివారం నాడు మినప గారెలు పేదవారికి దానం చేయాలి, ప్రతి నిత్యం సుబ్రహ్మాణ్య దేవాలయం లో 18 సార్లు ప్రదక్షిణలు చేయాలి. సుబ్రహ్మాణ్య స్తోత్ర పారాయణ చేయాలి.
కేతు గ్రహ అనుగ్రహమునకు
ధ్యాన శ్లోకం: ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్
రోజుకి 108 సార్లు, 65 రోజుల పాటు చదవాలి.
దానములు: మంగళవారంనాడు ఒకటింపావు కిలో ఉలవలు దానం ఇవ్వాలి, నానపెట్టి ఆవుకి పెట్టాలి, పేద వారికి ఉలవ చారు తో భోజనం పెట్టాలి గరికతో గణపతి ని పూజించాలి, కేతు శ్లోకం(7 సార్లు) పాటు సంకటనాశన గణేశ స్తోత్రమును చదవాలి. జొన్నలు, సజ్జలను పావురాలకు ఆహారముగ వెయ్యాలి. వేసవి కాలములో పక్షులకు తాగునీటి ఏర్పాటు చేయాలి.
పైన తెలిపిన దానములను వారి గ్రహ స్థానములను బట్టి, వారి స్తోమతలను బట్టి మరియు వారి కటుంబ ఆచారముల ప్రకారముచేసుకోగలరు